-
నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
-
ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నం
-
78 లక్షల మంది అర్హులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో తల్లికి వందనం పథకం పై స్పష్టత వస్తోంది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరిట పథకాన్ని అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం దానిని తల్లికి వందనంగా పేరు మార్చుతూ అమలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో పెద్ద ఎత్తున అమలు చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. జూన్ 12న తల్లుల ఖాతాలో నగదు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
విద్యార్థుల వివరాలు సేకరణ…
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల వివరాలను సేకరించింది విద్యాశాఖ. దాదాపు 78 లక్షల మంది విద్యార్థుల వివరాలను సేకరించగలిగింది. ఈ వివరాలను సచివాలయాల వారీగా క్షేత్రస్థాయిలో సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలన ప్రక్రియ మరో రెండు నుంచి మూడు వారాల్లో పూర్తికానుంది. అటు తరువాత తుది అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించనుంది. అర్హత ఉండి వివిధ కారణాలతో నగదు జమ కాకపోతే.. మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించనుంది. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13 వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ నిబంధనలు తప్పనిసరి…
తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థి తల్లికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వ్యవసాయ భూమికి సంబంధించి మాగాణి అయితే మూడు ఎకరాల లోపు ఉండాలి. మెట్టు భూమి అయితే 10 ఎకరాల్లోపు ఉండాలి. ఇంటి విద్యుత్ వినియోగంలో 300 యూనిట్లు కంటే తక్కువ వాడకం ఉండాలి. నివాస స్థలం పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉండాలి.
ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు. ఈ అర్హతలు ఉండే వారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ సాయం అందనుంది. గతంలో ఇంట్లో ఒకరి కి మాత్రమే వర్తించేది. కానీ చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు పథకాన్ని అమలు చేసి చూపిస్తున్నారు.