క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా మోతె పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా అదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎండీ షరీఫ్ (23)ను గుర్తించారు. అతడితో పాటు జిల్లేపల్లి సుందర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నర్సింహ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మోతె మండలం బిక్యా తండాకు చెందిన హాలావత్ నాగులు, బూబా (41) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంతకాలంగా మోతె గ్రామానికి వచ్చి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇద్దరికీ వివాహాలు జరిగాయి.
కుటుంబ పంచాయితీ విషయంలో పోలీస్‌స్టేషన్‌కు రావడంతో నాగులు, బూబాకు కానిస్టేబుల్ షరీఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తమ అల్లుడు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని, ఆర్థికంగా సహాయం చేయాలని వారు షరీఫ్‌ను కోరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో షరీఫ్ సుమారు రూ.3 లక్షలను వారికి అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆ డబ్బును తిరిగి చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా తనను బెదిరిస్తున్నారని షరీఫ్ భావించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నాగులు, బూబాను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది.
హత్యకు ముందుగా వారిని నమ్మించేందుకు షరీఫ్ గొర్రెల రుణం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. గొర్రెల లోన్ పొందాలంటే ముందుగా గొర్రెలను చూపించాల్సి ఉంటుందని, అందుకోసం గ్రామ శివారులో వాటిని ఉంచేందుకు స్థలం, నీటి వసతి, గొర్రెల ఎరువు కోసం గుంత అవసరమని దంపతులను నమ్మించినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని షరీఫ్ తనకు పరిచయమున్న జిల్లేపల్లి సుందర్‌కు చెప్పగా, అతడు కూడా సహకరించేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కలిసి హత్యకు ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో తేలింది.
ఆగస్టు 11 రాత్రి పథకం ప్రకారం నాగులు, బూబాను ఒక్కొక్కరిని గ్రామ శివారులోని ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు అక్కడ వారిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను ముందుగా సిద్ధం చేసిన గుంతలో పూడ్చిపెట్టినట్లు వెల్లడించారు. బూబా ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. ఈ ఆధారాల ఆధారంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
also read : ఏపీ-ఒడిశా సరిహద్దులో దారుణం.. అదృశ్యమైన యువతి మృతదేహం వెలికితీత
