-
గాంధీ పరివార్ అంటూ కొత్త నినాదం
-
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే ఏకైక లక్ష్యం అంటూ వాదన
-
సొంత పార్టీలో సీనియర్లకు చెక్
-
జాతీయస్థాయి నాయకుడిగా అవతరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ తన రాజకీయానికి మరింత పదును పెడుతున్నారు. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతూనే.. మరోవైపు సొంత పార్టీలో ఉండి తనను దెబ్బతీయాలని చూస్తున్న వారికి సరైన సమాధానం చెప్పాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ హై కమాండ్ పేరు చెప్పుకొని పార్టీలో ఒక అస్పష్ట వాతావరణానికి ప్రయత్నిస్తున్న సీనియర్ల ఆగడాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నేతలతో మరింత నమ్మకంగా ఉండాలని భావిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ అగ్ర నేతల పేరు చెప్పుకొని సొంత పార్టీలో అగాధం సృష్టించాలనుకున్న వారికి గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు.
కేరళలో పర్యటిస్తున్న సీఎం రేవంత్.. గాంధీ పరివార్, దేశ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన రాజకీయ జీవితంలో మిగిలి ఉన్న ఏకైక లక్ష్యం అంటూ స్పష్టం చేశారు.
-
గొప్ప విధేయత..
సాధారణంగా రాజకీయాల్లో వాడే నినాదాలు కంటే అత్యంత తీవ్రమైన త్యాగం, ప్రాణత్యాగం అనే పదాలను ఉపయోగించి కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన విధేయతను ప్రకటించారు రేవంత్ రెడ్డి. అత్యంత పదునైన అస్త్రాన్ని ప్రయోగించారు. రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారో లేదో బిజెపి తీవ్రమైన రీతిలో స్పందించింది.
దేశం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం ఎవరైనా ప్రాణాలు ఇస్తారంటే అర్థం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో స్వార్థ రాజకీయ కుటుంబం కోసం, నకిలీ గాంధీల కోసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధపడటం ఏమిటని మండిపడింది.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక సీఎం.. ఒక కుటుంబం పట్ల ఈ స్థాయిలో గుడ్డి విధేయత చూపడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు బిజెపి నేతలు.
-
అంతా ప్రణాళికతోనే..
తెలంగాణ సీఎం రేవంత్ పక్కా ప్రణాళికతోనే తన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. ఆయన పొలిటికల్ జర్నీ పరిశీలిస్తే.. కాంగ్రెస్ మూలం లేదు. ఒక ఏబీవీపీ కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా కీలకంగా వ్యవహరించారు.
కెసిఆర్ నాయకత్వంతో పాటు పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే శక్తులను ఏకీకృతం చేసే వ్యూహంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వతహాగా కాంగ్రెస్ మనిషి కాకపోవడంతో.. పార్టీలో సీనియర్ల నుంచి.. ప్రత్యర్థుల నుంచి ఆయనపై ఏదో ఒక రూపంలో రాజకీయ దాడి జరుగుతూనే ఉంది.
అందుకే ఇప్పుడు తాను పక్కా కాంగ్రెస్ నేతను అని.. హై కమాండ్ కు తిరుగులేని నమ్మకుస్తుడిని అని చాటుకోవడానికి ఇటువంటి తరహా ప్రకటనలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
వారికి చెక్ పెట్టేందుకు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప గ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలు, పరిపాలనలో సొంత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సొంత పార్టీలో సీనియర్లను, అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఇది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరంగా మారింది. దీనిని అధిగమించాలంటే ఢిల్లీ పెద్దల పూర్తి మద్దతు వారికి అవసరం.
అందుకే అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు కోసం బలంగానే ప్రయత్నిస్తున్నారు. గాంధీ పరివార్ వైపు సైనికుడుగా నిలబడతానని చెప్పడం ద్వారా.. కేంద్ర పెద్దలకు గట్టి సంకేతాలు పంపారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలో తన సీఎం కుర్చీని మరింత భద్రపరుచుకోవడంతోపాటు.. జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ టీం లో అత్యంత నమ్మకమైన నాయకుడిగా స్థానం సంపాదించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రాణత్యాగం కామెంట్ క్లాసిక్ కాంగ్రెస్ మార్కు రాజకీయంలో భాగమే..
