క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ దూకుడు పెంచుతుంది. అదే సమయంలో విపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగా.. గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో బలపడడం లేదన్న టాక్ కూడా ఉంది. అదే సమయంలో బిజెపి సైతం అనుకున్న లక్ష్యానికి చేరువ కావడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పోల్ ట్రాకర్ సంస్థ తన తాజా సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంశాన్ని ఈ సర్వేలో అంచనా వేసింది.
మరోసారి కాంగ్రెస్…
ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పోల్ ట్రాకర్ అంచనా వేస్తోంది. అసెంబ్లీలో 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 68 సీట్లు గెలుచుకొని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపింది. గులాబీ పార్టీ 31 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. భారతీయ జనతా పార్టీకి 12 సీట్లు, ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయని తన సర్వే నివేదికలో తెలిపింది. ఈ ఫలితాల వెనుక కారణాలు కూడా పోల్ ట్రాకర్ సంస్థ వెల్లడించింది.
కారణాలు అవే…
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇతర సంక్షేమ పథకాలు బాగా పనిచేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలు, పేద కుటుంబాలకు ఇవి అండగా ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు, మహిళలకు ఉచిత బస్సు పథకం, తెలంగాణ రైజింగ్ కార్యక్రమాలు ప్రభుత్వ ఇమేజ్ పెంచినట్లు చెబుతోంది. అలాగే గులాబీ పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండిపోవడం ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నట్లు విశ్లేషించింది. దీనివల్ల ఓటర్లలో టిఆర్ఎస్ గతంలోల దూసుకుపోవడం లేదని తెలిపింది.
