Homeక్రైమ్రాంగ్ రూట్‌లో బైక్‌.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలి

రాంగ్ రూట్‌లో బైక్‌.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలి

క్రైమ్ మిర్రర్ : ఒకరి నిర్లక్ష్యం ఓ యువతి జీవితాన్ని బలితీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా రాంగ్ రూట్‌లో ద్విచక్రవాహనాన్ని నడిపిన వ్యక్తి కారణంగా 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ హఫీజ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ కుమార్తె షేక్ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఆరీఫ్ తన కుమార్తెను బైక్‌పై కళాశాలకు తీసుకెళ్తున్నారు. ఫీవర్ ఆసుపత్రి సిగ్నల్స్ సమీపంలోని షైలా కేఫ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం కనిపించింది.

అనూహ్యంగా ఎదురైన బైక్‌ను తప్పించేందుకు ఆరీఫ్ వెంటనే బ్రేకులు వేయడంతో ఆయన వాహనం అదుపుతప్పి రోడ్డుకు ఎడమవైపు పడిపోయింది. ఈ క్రమంలో ఆయిషా కుడివైపు రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద ఆమె చిక్కుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయిషా అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఎస్బీఐ ఉద్యోగి అరెస్ట్

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని బీఎం ధర్మరాజుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రాంగ్ రూట్‌లో ద్విచక్రవాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైనందుకు అతడిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాంగ్ రూట్ ప్రయాణంపై సీపీ ఆగ్రహం

ఈ ప్రమాదంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల ఒక యువతి నిండు జీవితం ముగిసిపోయిందని ఆవేదన చెందారు. మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ ఉన్నతమైన భవిష్యత్తు కోసం కలలు కంటున్న ఆయిషా జీవితం అర్ధంతరంగా ముగియడం బాధాకరమని పేర్కొన్నారు.

కుమార్తెను స్వయంగా కళాశాలకు తీసుకెళ్తున్న తండ్రి కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడం అత్యంత హృదయవిదారకమని సజ్జనార్ అన్నారు. క్షణాల వ్యవధిలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.

రోడ్డుపై కొద్దిసేపు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని హెచ్చరించారు. చదువుకున్నవారు, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం నిబంధనలు ఉల్లంఘించడం ఆందోళనకరమన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించే అలవాటును విడనాడాలని సూచించారు.
also read : ఏపీలో వెబ్‌ల్యాండ్ భూ రికార్డుల కుంభకోణం.. నలుగురు అరెస్ట్.. తెరపైకి సంచలన విషయాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు