Homeతెలంగాణతెలంగాణ విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొస్తున్న ప్రభుత్వం!

తెలంగాణ విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొస్తున్న ప్రభుత్వం!

తెలంగాణలోని విద్యాసంస్థల్లో నిర్వహించే ప్రైవేట్, వాణిజ్య కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య ఈవెంట్లకు అనుమతి లేకుండా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని యోచిస్తోంది. ఇటీవల విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు, విద్యార్థుల మృతితో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకలో ప్రమాదం చోటుచేసుకుని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మరో ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా కూడా అవాంఛనీయ ఘటన జరిగింది. ఈ పరిణామాలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాల భద్రతపై ఆందోళనలను పెంచాయి.

ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల ప్రాంగణాలను ప్రధానంగా విద్యా సంబంధిత, క్రీడా కార్యక్రమాలకే వినియోగించాల్సి ఉంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు, ఇతర వాణిజ్య ఈవెంట్ల నిర్వహణపై నిషేధం విధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అదేవిధంగా పెద్దఎత్తున క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విద్యాసంస్థలు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు? తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లు ఏమిటి? అనే వివరాలను ముందుగానే పోలీసు, అగ్నిమాపక శాఖలకు తెలియజేయాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై భారీ జరిమానాలతో పాటు ఇతర కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల భద్రత కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. విద్యార్థుల రక్షణకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ సైతం ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం.

ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలపై స్పష్టమైన నియంత్రణ ఏర్పడనుంది.

also read: తమ్మిడికుంట చెరువుకు సరికొత్త రూపు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు