Homeక్రైమ్ దీపావళి వేళ కాల్పుల కలకలం.. రాష్ట్రపతి భవన్ భద్రతా విధులు నిర్వహించే జవాన్‌పై దాడి!

 దీపావళి వేళ కాల్పుల కలకలం.. రాష్ట్రపతి భవన్ భద్రతా విధులు నిర్వహించే జవాన్‌పై దాడి!

ఉత్తరప్రదేశ్‌లో దీపావళి పండుగ వేళ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్‌లో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఓ భారత సైనికుడిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే ఈ దాడికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సైనికుడితో పాటు ఆయన సోదరుడు కూడా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లా గోపాల్‌పూర్ ఖదానా గ్రామానికి చెందిన సౌరభ్ తోమర్ (26) 2021లో భారత సైన్యంలో చేరారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగమైన ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ (PBG) రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సెలవుపై స్వగ్రామానికి వచ్చారు.

నవంబర్ 8న రాత్రి తన సోదరులు వినీత్, మింటూతో కలిసి ఇంటి బయట బాణసంచా కాలుస్తుండగా గ్రామానికి చెందిన ధీరజ్, అతడి సోదరుడు మోను అలియాస్ ప్రవీణ్ అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది.

వాగ్వాదం జరుగుతున్న సమయంలో నిందితుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బుల్లెట్ నేరుగా తగలకుండా గోడకు తాకి పక్కకు దూసుకెళ్లి సౌరభ్ చెవి వెనుక భాగంలో తగిలింది. మరోవైపు వినీత్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన సౌరభ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే మీరట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఈ ఘటనపై సౌరభ్ తండ్రి జనక్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమాలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధీరజ్, మోను పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఏమిటీ ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్?

ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ (PBG) భారత సైన్యంలో అత్యంత పురాతనమైన, సీనియర్ అశ్విక దళ రెజిమెంట్‌గా గుర్తింపు పొందింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతికి భద్రత కల్పించడం ఈ విభాగం ప్రధాన బాధ్యత. రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లోనూ ఈ రెజిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది.

also read: ‘తాళ్’ సినిమాకు రెహమాన్‌ మ్యూజిక్ ఎలా ఉంటుందో అని భయపడ్డా.. ఆసక్తికర విషయం బయటపెట్టిన సుభాష్ ఘయ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు