ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్.. ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనలో ఉన్న అసాధారణ సంగీత ప్రతిభను కొనియాడుతూ, తమ కాంబినేషన్లో వచ్చిన ‘తాళ్’ సినిమా వెనుక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక పోస్టును పంచుకున్నారు.
1999లో విడుదలైన ‘తాళ్’ చిత్రానికి సంగీతం అందించే బాధ్యతను ఏఆర్ రెహమాన్‌కు అప్పగించే సమయంలో తాను కొంత ఆందోళనకు గురైనట్లు సుభాష్ ఘయ్ తెలిపారు. అప్పట్లో రెహమాన్‌కు హిందీ భాషా సాహిత్యం, బాలీవుడ్ సినిమాలపై పెద్దగా పరిచయం లేకపోవడంతో సినిమా సంగీతాన్ని ఎలా అందిస్తారోనని సందేహించానని గుర్తుచేసుకున్నారు.
అయితే, తన గత చిత్రం ‘హీరో’లోని ఫ్లూట్ సంగీతాన్ని తాను ఎంతో ఇష్టపడేవాడినని రెహమాన్ చెప్పిన మాటలు తనకు ధైర్యాన్నిచ్చాయని ఘయ్ వెల్లడించారు. దీంతో రెహమాన్ ప్రత్యేక సంగీత శైలిపై నమ్మకంతో ఆయనతో కలిసి ముందుకు సాగినట్లు వివరించారు. ఆ ప్రయత్నం ఫలితంగానే ‘తాళ్’ పాటలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్‌ను మన విశ్వం అందించిన అద్భుతమైన సంగీత ప్రతిభగా అభివర్ణించిన ఘయ్.. ‘లగాన్’, ‘రంగ్ దే బసంతి’, ‘రాక్‌స్టార్’ వంటి సినిమాలతో భారతీయ సినీ సంగీతానికి ఆయన కొత్త గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. ముఖ్యంగా ‘జై హో’ పాటతో ఆస్కార్ అవార్డును అందుకోవడం భారతీయ సంగీతానికి గర్వకారణమని గుర్తుచేశారు.
ప్రాంతాలు, భాషలు, సంస్కృతులతో సంబంధం లేకుండా విభిన్నమైన సంగీతాన్ని అద్భుతంగా అందించగల సామర్థ్యం రెహమాన్ సొంతమని సుభాష్ ఘయ్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ తన సంగీతంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని ఆకాంక్షించారు.
కాగా, సుభాష్ ఘయ్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చిత్రాల్లో ‘తాళ్’తో పాటు ‘కిస్నా: ది వారియర్ పోయెట్’ (2005), ‘యువరాజ్’ (2008) కూడా ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన సంగీతం ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది.
also read: గురుకులంలో కలకలం…! నిద్రిస్తున్న విద్యార్థినుల జడలు కత్తెరించిన ఆకతాయిలు…
