దీపావళి పండుగ ముగిసినప్పటికీ కొందరు అర్ధరాత్రి వరకు బాణసంచా కాలుస్తూ భారీ శబ్దాలు చేయడంపై నటి రేణూ దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. పండుగ పేరుతో ఇతరులకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
దీపావళి రోజునే టపాసుల కాల్చడంపై స్పందిస్తే తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారనే భావనతో అప్పట్లో మౌనంగా ఉన్నానని రేణూ దేశాయ్ తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో బాణసంచా పేల్చడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
టపాసుల మోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా శబ్దాల వల్ల ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
దీపావళి అంటే దీపాలతో వెలుగులు నింపుకునే పండుగ అని, దానిని శబ్దాల పోటీగా మార్చకూడదని రేణూ దేశాయ్ సూచించారు. రాత్రి 10 గంటలలోపే బాణసంచా కాల్చడం ముగించి, ఆ తర్వాత ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. పండుగ ఆనందం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదనే సందేశాన్ని ఆమె తన పోస్టు ద్వారా ఇచ్చారు.
also read: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత.. మలయాళ సినీ పరిశ్రమలో విషాదం!
