క్రైమ్ మిర్రర్ : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధం గురించి ఇతరులకు తెలుస్తుందనే భయంతో ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడికి కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటన కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ కొంతకాలంగా తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఒకరోజు వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని పదో తరగతి చదువుతున్న రవి (15) చూశాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేస్తానని బాలుడు చెప్పడంతో అపర్ణ, అజయ్ ఆందోళనకు గురయ్యారు.
తమ బంధం బయటపడకుండా ఉండేందుకు రవిని హతమార్చాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగా గత నెల 24న బాలుడిని బయటకు తీసుకెళ్లి, కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. కొద్దిసేపటికే రవి నోటిలో బొబ్బలు రావడంతో పాటు శరీరంపై అలర్జీ లక్షణాలు కనిపించాయి.
అనారోగ్యానికి గురైన రవి కారణం ఏమిటని ప్రశ్నించగా, తాను తాగిన కూల్‌డ్రింక్‌లో విషపదార్థం కలిపినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయాన్ని వెంటనే తండ్రికి, బంధువులకు వివరించాడు. కుటుంబ సభ్యులు అతడిని మొదట ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆదివారం చికిత్స పొందుతూ రవి కన్నుమూశాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అపర్ణ, అజయ్‌లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
also read : సెలవులకని ఇంటికొచ్చి… రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం..
