-
పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు
-
ఈనెల 13న షెడ్యూల్
-
మూడు దశల్లో పోలింగ్
-
రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు
-
రాజకీయంగా వేడెక్కనున్న గ్రామాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మరో ఎన్నికలకు తెరలేచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీలతో పాటు జడ్పిటిసి లకు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 13న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 13219 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. దీంతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.
మూడు విడతల్లో పోలింగ్.. గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి దశ పోలింగ్ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. మొదటి దశకు సంబంధించి నవంబర్ 13న, రెండో దశకు 16న, మూడో దశకు 19 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారం అన్ని దశలవారీగా కొనసాగుతాయి. ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు పై చేయి సాధించగా.. పంచాయితీ ఎన్నికలు ఎవరికి పట్టం కడతాయి అని చర్చ కొనసాగుతోంది.
పార్టీల గుర్తులు లేకుండా…
పంచాయితీ ఎన్నికలు రాజకీయ పార్టీలు, గుర్తులకు అతీతంగా జరుగుతాయి. కానీ రాజకీయ ముద్ర కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటికే పూర్తయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. ఆ పార్టీ అధినేత జగన్ సొంత ప్రాంతం రాయలసీమలో కూడా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే పంచాయితీ ఎన్నికల్లో బలం పుంజుకోవాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోల్పోకుండా కూటమి గట్టి ప్రయత్నాలు చేయనుంది. పంచాయితీ ఎన్నికలతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలు కానుంది.
