క్రైమ్ మిర్రర్ : నగరంలో వెలుగుచూసిన అక్రమ మానవ అండాల సేకరణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం నుంచి ఐదు రోజుల పాటు వారిని విచారించనున్నారు. మరోవైపు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టయిన దుర్గాప్రసాద్‌ను కూడా పీటీ వారెంట్‌పై బేగంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది.
పేద మహిళలకు డబ్బు ఆశ చూపి అండాల సేకరణ
అక్టోబర్ 31న ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శర్మ వివిధ రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు డబ్బు ఆశ చూపి నగరంలోని ఓ మహిళల హాస్టల్లో ఉంచేవారని సమాచారం. అనంతరం నగరంలోని ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాలకు అవసరమైన మానవ అండాలను వారి నుంచి సేకరించి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ప్రక్రియలో వైద్య శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
నకిలీ ఆధార్ కార్డులతో వ్యవహారం
అండాల సేకరణ కోసం సైదాబాద్‌కు చెందిన ప్రవీణ్ సహకారంతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకే మహిళ నుంచి పలుమార్లు అండాలను సేకరించినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి అమిత్ శర్మ, నిఖిత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్, ఎస్.కే. పర్వీన్, విజయ్ భాగ్యరావు, పంకజ్ సోనిలను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధాలున్నట్లు గుర్తించిన దుర్గాప్రసాద్‌ను సరూర్‌నగర్ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు.
రూ.2 కోట్ల లావాదేవీలపై పోలీసుల ఆరా
ఈ అక్రమ వ్యవహారంలో అమిత్ శర్మ ముఠాకు, నగరంలోని ఓ ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాలకు మధ్య సుమారు రూ.2 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో నగరంలోని దాదాపు 16 ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాల నిర్వాహకులకు బేగంపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి బేగంపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎనిమిది మంది నిందితులను ఐదు రోజుల కస్టడీకి తీసుకోవడంతో విచారణలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.
మరిన్ని కీలక విషయాలపై ఆరా
నిందితులను విడివిడిగా విచారించి అండాల సేకరణ వెనుక ఉన్న నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వైద్య కేంద్రాల పాత్రపై పోలీసులు వివరాలు సేకరించనున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? మహిళలను ఏ విధంగా గుర్తించి నగరానికి తీసుకొచ్చారు? నిబంధనలకు విరుద్ధంగా అండాల సేకరణ ఎన్ని కేంద్రాల్లో జరిగింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిందితుల కస్టడీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై మల్కాజిగిరి పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. పోలీసుల విచారణ పూర్తయితే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read ; రైల్వే ప్రయాణికులే టార్గెట్.. ముగ్గురు పాత నేరస్థులు అరెస్ట్
