క్రైమ్ మిర్రర్ : భార్యపై అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది. తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం హత్యను మరో కోణంలో చూపించేందుకు మృతదేహంపై ఉన్న దుస్తులను తొలగించి, అత్యాచారం జరిగినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో నిందితుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడవలు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన జహదూర్ ఇస్లాం తన భార్య రుబీనా ఖాతున్తో కలిసి ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లాడు. హోషియార్పూర్ జిల్లా ముకేరియన్ పరిధిలోని మదీన్పూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ మురుగునీటి కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని జహదూర్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య
ఇటీవల ఓ రోజు పని ముగించుకున్న అనంతరం రుబీనాను గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తువ్వాలుతో ఆమె గొంతు బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం మృతదేహంపై ఉన్న దుస్తులను తొలగించి, సమీపంలోని చెరకు తోటలో పడేశాడు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా కనిపించేలా ఆధారాలను సృష్టించేందుకు ప్రయత్నించాడు.
బావకు ఫోన్ చేసి నాటకం
హత్య అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన బావ సోహెల్ అలీకి జహదూర్ ఫోన్ చేశాడు. రుబీనా ఆచూకీ తెలియడం లేదని చెప్పడంతో ఆందోళన చెందిన ఆమె సోదరుడు వెంటనే మదీన్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమె కోసం వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం
రుబీనా అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టగా జహదూర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించింది. భార్య ఎక్కడికి వెళ్లిందనే ప్రశ్నలకు అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో చివరకు తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో చెరకు తోటలో ఉన్న రుబీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యపై ఇతరులు లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు నమ్మించేందుకే మృతదేహాన్ని ఆ స్థితిలో వదిలినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. జహదూర్ ఇస్లాంను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : బోరుబావి గొడవతో బీభత్సం.. 17 నెలల పసికందును విసిరేసిన వ్యక్తి!
