క్రైమ్ మిర్రర్ : చిన్నపాటి ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బోరుబావి నీటి పైప్‌లైన్ విషయంలో మొదలైన గొడవ ఇరువర్గాల మధ్య దాడులకు కారణమైంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి తండ్రి, కుమార్తెపై దాడికి పాల్పడటమే కాకుండా, 17 నెలల చిన్నారిని సైతం కనికరం లేకుండా దూరంగా విసిరేశాడు. ఈ ఘటనలో పసికందు తలకు గాయమవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
బోరుబావి విషయంలో మొదలైన వివాదం
పరిగి మండలం సాలిపాలబాట తండాలో చందర్, రవి కుటుంబాల మధ్య బోరుబావి యాజమాన్యంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. బోరుబావి తమదంటే తమదంటూ ఇరువర్గాల వారు వాదించుకున్నారు. ఈ క్రమంలో రవి కుటుంబ సభ్యులు బోరుబావికి సంబంధించిన నీటి పైప్‌లైన్‌ను కత్తిరించారు. ఈ విషయాన్ని గమనించిన చందర్, ఆయన కుమార్తె సుచిత్ర వీడియో తీస్తూ రవి కుటుంబ సభ్యులను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన రవి కుమారుడు తులసీరామ్ తీవ్ర ఆవేశంతో చందర్ ఇంటికి వెళ్లాడు.
ఇంట్లోకి చొరబడి దాడి.. పసిపాపపై అమానుషం
చందర్ ఇంట్లోకి ప్రవేశించి తులసీరామ్ ఆయనతో పాటు కుమార్తె సుచిత్రపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సుచిత్ర 17 నెలల చిన్నారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో పసికందును దూరంగా విసిరేయడంతో చిన్నారి తలకు గాయమైంది. ఈ దాడిలో చందర్ కూడా గాయపడ్డారు. గాయపడిన చందర్, సుచిత్రతో పాటు చిన్నారికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణ
బోరుబావి పైప్‌లైన్‌ను కత్తిరించిన ఘటనపై ముందుగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని బాధితుడు చందర్ ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుపై సకాలంలో స్పందించి ఉంటే ఈ దాడి జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బోరుబావి వివాదం కారణంగా ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేయడం, పసికందును సైతం వదలకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
also read : పండుగ రాత్రి పాశవికం.. అక్కపై గ్యాంగ్ రేప్, చెల్లికి తుపాకీతో బెదిరింపులు!
