ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన ఓ యువకుడి కుడి చేతిని వైద్యులు విజయవంతంగా తిరిగి అతికించారు. మణికట్టు వరకు తెగిపోయిన చేతికి ఏడు గంటలకు పైగా అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి రక్త ప్రసరణను పునరుద్ధరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ అరుదైన వైద్య ఘటన చోటుచేసుకుంది.
హాపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఘజియాబాద్‌లోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. జూలై 21న నిర్మాణ ప్రదేశంలో పనిచేస్తుండగా అతడి కుడి చేయి ప్రమాదవశాత్తు ఓ యంత్రంలో చిక్కుకుంది. యంత్రంలో చేయి తీవ్రంగా నలిగిపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే తెగిన చేతిని భద్రపరిచి యువకుడిని ఘజియాబాద్‌లోని యశోద మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరుకున్న యువకుడికి వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్లాస్టిక్, పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ శోభిత్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రజేష్ కౌష్లే నేతృత్వంలోని వైద్య బృందం పరిస్థితిని పరిశీలించి వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది.
యంత్రంలో నలిగిపోవడంతో చేతిలోని ఎముకలు, రక్తనాళాలు, నరాలు, మృదు కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత విరిగిన మణికట్టు ఎముకను స్థిరీకరించిన వైద్యులు.. అనంతరం మైక్రోసర్జరీ విధానంలో ధమనులు, సిరలను తిరిగి అనుసంధానించారు. దెబ్బతిన్న నరాలు, ఇతర మృదు కణజాలాలను కూడా సరిచేశారు. రక్తనష్టం ఎక్కువగా ఉండటంతో అవసరమైన మేరకు రక్తాన్ని ఎక్కించారు.
ఏడు గంటలకు పైగా సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్స అనంతరం తెగిపోయిన చేతికి మళ్లీ రక్త ప్రసరణ ప్రారంభమైంది. చికిత్స అనంతరం యువకుడి ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే చేతి పనితీరు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. క్రమంగా వేళ్ల కదలిక, స్పర్శ వంటి సామర్థ్యాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చేతిలో బలం, పట్టును మెరుగుపరుచుకోవడానికి ఫిజియోథెరపీతో పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమని వివరించారు.
సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడమే కీలకం
తెగిపోయిన చేతిని, బాధితుడిని ఆలస్యం చేయకుండా సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి తీసుకురావడం వల్లే ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన విధంగా ప్రాథమిక చికిత్స అందించి, తెగిన అవయవాన్ని భద్రపరిచి నిపుణులైన వైద్యుల వద్దకు తీసుకెళ్లడం ఇలాంటి సందర్భాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు.
also read: డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. టైర్ పంక్చర్ కావడంతో మధ్యలోనే వదిలేసిన దొంగలు!
