-
ఆమనగల్లులో ప్రీ-ప్రైమరీ టీచర్ నియామకాల్లో మెరిట్‌కు మంగళం..?
-
నాలుగో ర్యాంక్ అభ్యర్థికి పోస్టు.. మెరిట్ అభ్యర్థికి మంగళం..?
-
మండల విద్యాధికారి కి తెలియకుండానే నియామకాలా..?
-
అధికారుల సమాధానాలపై గ్రామస్థుల సందేహాలు..!
క్రైమ్ మిర్రర్, వేములపల్లి: ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల నియామకాలు వివాదానికి దారితీస్తున్నాయి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని అమనగల్లు గ్రామంలో మెరిట్‌లో ముందున్న అభ్యర్థిని కాదని, నాలుగో స్థానంలో ఉన్న అభ్యర్థికి పోస్టు కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
-
4 గ్రామాలు.. 37 మంది అభ్యర్థులు!
నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని అమనగల్లు, రావులపెంట, సల్కునూర్, ఇటిక్యాల గ్రామాల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఒక్కో పాఠశాలలో ఒక్కో పోస్టు చొప్పున నియామకాలు చేపట్టారు. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉందని సమాచారం.
ఈ నాలుగు గ్రామాల్లో మొత్తం 37 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అమనగల్లు నుంచి 11 మంది, రావులపెంట నుంచి 9 మంది, సల్కునూర్ నుంచి 10 మంది, ఇటిక్యాల నుంచి 7 మంది దరఖాస్తు చేసుకున్నారు.
-
అమనగల్లులోనే అసలు వివాదం!
అమనగల్లు గ్రామానికి చెందిన ఉతేర్ల శ్రేయ మెరిట్‌లో ముందున్నప్పటికీ, ఆమెకు కాకుండా నాలుగో స్థానంలో ఉన్న మెరుగు సంతోషకు ఇన్‌స్ట్రక్టర్ పోస్టు కేటాయించినట్లు స్థానికంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన మూడు గ్రామాల్లో మెరిట్‌లో ముందున్న అభ్యర్థులకే పోస్టులు కేటాయించినట్లు సమాచారం. అయితే అమనగల్లు గ్రామంలో మాత్రం ఎంపిక విధానం భిన్నంగా ఉండటానికి కారణాలేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టామని చెబుతున్నప్పుడు, మెరిట్‌లో వెనుకబడిన అభ్యర్థికి పోస్టు ఎలా కేటాయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంపికలో ఏవైనా ప్రత్యేక రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

-
మండల విద్యాధికారి వివరణతో మరిన్ని ప్రశ్నలు!
ఈ వ్యవహారంపై మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్‌ను వివరణ కోరగా, తనకు ఈ నియామకాలతో ఎలాంటి సంబంధం లేదని, తన బాధ్యత కేవలం దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) కార్యాలయానికి పంపించడం మాత్రమేనని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక జిల్లా స్థాయిలో జరిగిందని, పోస్టులు పైస్థాయి అధికారులు నియమించి పంపించారని, ఎంపిక ఎలా జరిగిందో తనకు తెలియదని వెల్లడించారు.
మండల విద్యాధికారికే ఎంపిక ప్రక్రియపై పూర్తి సమాచారం లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. స్థానికంగా నియామకాలు జరిగినప్పటికీ, ఎంపికకు సంబంధించిన మెరిట్ జాబితా, మార్కుల వివరాలు, తుది ఎంపిక ఉత్తర్వులను బహిర్గతం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
-
ఆయా పోస్టుల్లోనూ ఇంకా ఖాళీలు!
మండలంలోని నాలుగు గ్రామాల్లో ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయగా, నాలుగు ఆయా పోస్టులకు గాను ఇప్పటివరకు రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేసినట్లు మండల విద్యాధికారి వెల్లడించారు. అమనగల్లు, సల్కునూర్ గ్రామాల్లో ఆయా పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు.
-
మెరిట్ జాబితా బహిర్గతం చేస్తారా?
అమనగల్లు గ్రామంలో ఇన్‌స్ట్రక్టర్ పోస్టు ఎంపికపై వస్తున్న ఆరోపణలకు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల ఇంటర్మీడియట్ మార్కులు, మెరిట్ ర్యాంకులు, ఎంపికకు అనుసరించిన నిబంధనలు, తుది ఎంపిక జాబితాను బహిర్గతం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మెరిట్‌లో ముందున్న అభ్యర్థికి ఎందుకు పోస్టు దక్కలేదో అధికారులు వివరణ ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
