హైదరాబాద్‌లో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థలైన కేఎఫ్‌సీ, డొమినోస్‌కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని పలు ఔట్లెట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించిన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం తొమ్మిది ఔట్లెట్ల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఇందులో ఏడు కేఎఫ్‌సీ, రెండు డొమినోస్ శాఖలు ఉన్నాయి. ఈ పరిణామం నగరంలోని ఫాస్ట్‌ఫుడ్ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది.
26 ఔట్లెట్లలో ఏకకాలంలో తనిఖీలు
తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) విభాగానికి చెందిన అధికారులు పోలీసుల సహకారంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 13 బృందాలుగా ఏర్పడి నగరవ్యాప్తంగా కేఎఫ్‌సీ, డొమినోస్‌కు చెందిన 26 ఔట్లెట్లలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నిల్వ, వంటగదుల పరిశుభ్రత, వంట సామగ్రి నాణ్యత, ఆహార భద్రతా నిబంధనలను పరిశీలించారు.
వంటగదుల్లో అపరిశుభ్రత.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు
తనిఖీల సందర్భంగా అధికారులకు అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కొన్ని ఔట్లెట్ల వంటగదులు, ఆహార నిల్వ కేంద్రాల్లో బొద్దింకలు, ఈగలు కనిపించాయి. ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, గోడలపై ఫంగస్, జిడ్డు పేరుకుపోయిన వంట పాత్రలు, అపరిశుభ్రమైన పరికరాలను గుర్తించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన కూడా వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వాడిన నూనె శుద్ధికి రసాయనం.. 52 కిలోలు స్వాధీనం
ఈ తనిఖీల్లో మరో తీవ్రమైన అంశాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటికే వినియోగించిన వంట నూనెను తిరిగి ఉపయోగించుకునేందుకు ‘సింథటిక్ మెగ్నీషియం సిలికేట్’ అనే రసాయనాన్ని నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సుమారు 52 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ జరిగిందనే అనుమానంతో మొత్తం 20 నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు.
ఈ ప్రాంతాల్లో కేఎఫ్‌సీ, డొమినోస్ శాఖలపై చర్యలు
లైసెన్సులు సస్పెండ్ చేసిన తొమ్మిది ఔట్లెట్లలో ఏడు కేఎఫ్‌సీ శాఖలు ఉన్నాయి. మదీనగూడ-మియాపూర్, సింధి కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ శాఖలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇక డొమినోస్‌కు సంబంధించి కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఔట్లెట్లపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ తొమ్మిది కేంద్రాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. తిరిగి లైసెన్సులు పునరుద్ధరించే వరకు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఆయా ఔట్లెట్లను తొలగించాలని సంబంధిత ప్లాట్‌ఫామ్‌లను కోరనున్నారు.
మరో 13 ఔట్లెట్లకు నోటీసులు
తొమ్మిది ఔట్లెట్లపై చర్యలతో పాటు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మరో 13 కేంద్రాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. వీటిలో నాలుగు కేఎఫ్‌సీ, నాలుగు డొమినోస్ ఔట్లెట్లకు మెరుగుదల చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. మరో ఐదు ఔట్లెట్లకు షోకాజ్ నోటీసులు పంపించి, ఉల్లంఘనల తీవ్రతను బట్టి జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
also read: అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. బౌలీ ఆర్ట్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలిగా నియామకం
