క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 చక్రాల భారీ ట్రైలర్ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పలువాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నం జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దౌలత్పురా టోల్ ప్లాజా నుంచి అజ్మీర్ రోడ్డు వైపు వెళ్తున్న 18 చక్రాల ట్రైలర్ వేగంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రైలర్ అదుపుతప్పింది.
అనాజ్ మండి వెనుక గేటు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టిన ట్రైలర్.. ఆ తర్వాత దారిలో ఉన్న పలు వాహనాలను ఢీకొంటూ ఫుట్‌పాత్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ పాదచారి ట్రైలర్ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి నుజ్జునుజ్జైన కారులో తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదంలో ట్రైలర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద ధాటికి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
also read : సంతానం లేదంటూ వేధింపులు.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!
