Homeసినిమా67 ఏళ్ల సినీ ప్రస్థానంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “నేను ఓల్డెస్ట్ జెన్ జెడ్”!

67 ఏళ్ల సినీ ప్రస్థానంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “నేను ఓల్డెస్ట్ జెన్ జెడ్”!

విలక్షణ నటుడు కమల్ హాసన్ సినీ ప్రయాణం 67 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన నటనా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ.. సినిమా నిరంతరం మారుతూనే ఉంటుందని, అందుకు అనుగుణంగా తాను కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని తెలిపారు.

తన 67 ఏళ్ల సినీ ప్రయాణంపై శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులకు కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణంలో తాను నేర్చుకున్న అసలు పాఠాలు సుమారు 20 ఏళ్లకు మాత్రమే పరిమితమని, మిగిలిన కాలం అనుభవాల ప్రవాహంలో సాగిపోయిందని తనదైన తాత్విక శైలిలో వ్యాఖ్యానించారు. కళాకారులు, ప్రేక్షకులు కలిసి సినిమా అనే మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.

సినిమా చరిత్రలో సగానికి పైగా నా ప్రయాణమే

సినిమా ఆవిర్భావాన్ని గుర్తుచేసుకున్న కమల్ హాసన్.. 1895 డిసెంబర్‌లో లూమియర్ సోదరులు తొలి చలనచిత్ర ప్రదర్శన నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి ప్రపంచ సినిమా దాదాపు 130 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు.

ఈ మొత్తం సినీ చరిత్రలో సగానికి పైగా కాలాన్ని తాను సినిమా రంగంలోనే గడిపానని తన బృందం గుర్తు చేసిందని కమల్ హాసన్ వెల్లడించారు. 67 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ.. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే భావనను ఆయన వ్యక్తం చేశారు.

ఆరేళ్లకే వెండితెరపై అడుగు

కమల్ హాసన్ కేవలం ఆరేళ్ల వయసులోనే ‘కళత్తూర్ కన్నమ్మ’ సినిమాతో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని అందుకుని చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకున్నారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు పలు భారతీయ భాషల్లో 230కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయిత, నిర్మాతగా కూడా భారతీయ సినిమాకు తనదైన ముద్ర వేశారు.

“ఓల్డెస్ట్ ఆఫ్ జెన్ జెడ్”

తరాలు మారుతున్నా.. సినిమా మాత్రం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. అందుకే తనను తాను సరదాగా “సినిమా ప్రపంచంలో అత్యంత పెద్ద వయసున్న జెన్ జెడ్”గా అభివర్ణించుకున్నారు.

67 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తయినప్పటికీ.. నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రం తనలో ఇంకా అలాగే ఉందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అనుభవం పెరిగే కొద్దీ కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన కూడా కొనసాగాలని ఆయన సందేశం చెబుతోంది.

also read: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై వేటు?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు