ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ కథ అందరికీ తెలిసిందే. అయితే అదే తరహాలో తన జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమను చాటేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా ఓ ‘తాజ్ మహల్’ తరహా ఇంటినే నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఇల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ప్రకాశ్ చౌక్సే తన భార్యకు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనే ఆలోచనతో ఈ ఇంటిని నిర్మించారు. 2021లో నిర్మాణం పూర్తయిన ఈ భవనం.. ఆగ్రాలోని అసలు తాజ్ మహల్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజ్ మహల్‌ను తలపించేలా నిర్మాణం
ఈ ఇంటిని అసలు తాజ్ మహల్ స్ఫూర్తితో రూపొందించారు. దాని అసలు నిర్మాణంతో పోలిస్తే దాదాపు మూడో వంతు పరిమాణంలో రెండు అంతస్తులుగా నిర్మించారు. ఈ ప్రత్యేకమైన ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టినట్లు సమాచారం.
బయటి నుంచి చూస్తే తెల్లటి గోడలు, మధ్యలో భారీ గుమ్మటం, నాలుగు మినార్లు, చుట్టూ అందమైన తోటలు కనిపిస్తాయి. దీంతో దూరం నుంచి చూస్తే ఇది నిజంగా తాజ్ మహల్‌నే తలపిస్తుంది.
ఇంటీరియర్ కూడా రాజభవనాన్ని తలపించేలా..
బయటి రూపమే కాకుండా ఇంటి లోపలి డిజైన్‌పైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 24 అడుగుల ఎత్తైన సీలింగ్స్, పాలరాతి ఫ్లోరింగ్, ఇరువైపులా ఏర్పాటు చేసిన మెట్లు, ఖరీదైన ఫర్నిచర్‌తో ఇంటిని ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్దారు.
ఈ ఇంటిని నిర్మించడం వెనుక తన భార్యపై ఉన్న ప్రేమే ప్రధాన కారణమని ఆనంద్ ప్రకాశ్ చౌక్సే గతంలో వెల్లడించినట్లు సమాచారం. అందుకే ఈ భవనాన్ని స్థానికంగా ‘మినీ తాజ్ మహల్’గా కూడా పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల కంటెంట్ క్రియేటర్ శుభమ్ ప్రజాపత్ ఈ ప్రత్యేకమైన ఇంటికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోలో ఆనంద్ ప్రకాశ్ చౌక్సే కుమారుడు ఇంటి నిర్మాణం, ప్రత్యేకతలను వివరిస్తూ కనిపించారు.
ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘మినీ తాజ్ మహల్’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య కోసం ఇంత ప్రత్యేకమైన ఇంటిని నిర్మించిన వ్యాపారవేత్తపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read: కంగనా రనౌత్ మరోసారి క్లారిటీ.. ‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై ఘాటు వివరణ
