క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తన నివాసం ముందు మద్యం సేవించవద్దని ఓ యువకుడిని ప్రశ్నించినందుకు ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అస్సాంకు చెందిన మెహక్ అహ్మద్ (19) నోయిడాలోని ఓ ప్రైవేట్ కాల్ సెంటర్లో పనిచేస్తూ, స్నేహితురాలు సంజనా (18)తో కలిసి ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. అదే అంతస్తులో నివసించే రమన్ అనే యువకుడు తరచూ ఆమె గది ఎదురుగా కూర్చొని మద్యం సేవించేవాడు.
ఈ విషయంపై మెహక్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన రమన్ కత్తితో మెహక్‌పై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని గదిలోనే వదిలి బీహార్‌కు వెళ్లిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. అనంతరం బీహార్‌లో అతడిని అదుపులోకి తీసుకుని నోయిడాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన వివరాలపై విచారణ కొనసాగుతోంది.
also read : ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు విద్యార్థులు మృతి
