-
పాత కేసుల విచారణకు ప్రాసిక్యూషన్ అనుమతి
-
వరుసగా కేసులు చుట్టుముట్టే అవకాశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు తప్పదా? ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? పాత కేసులు తెరపైకి వస్తుండడం దేనికి సంకేతం? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి హయాంలో కొడాలి నాని వ్యవహరించిన తీరుపై కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు విచారణకు తాజాగా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో సహా నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వీటిపై కేసు కూడా నమోదయింది. ఇప్పుడు ఈ కేసులో నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొడాలి నాని అరెస్టు తప్పదన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా నడుస్తోంది.
-
అప్పట్లో దూకుడుగా..
వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించారు కొడాలి నాని. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేసేవారు. 2021లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలో. ఆ సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేతతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Also Read: ఎంపీ VS ఎమ్మెల్యే…! – Crime Mirror
ఎన్నికల నియమావళి ఉల్లంఘించే విధంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా 2021 లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే రాష్ట్రమంత్రిగా ఉన్న దృష్ట్యా ఆయన పై కేసు విచారణ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
అందుకే పెండింగ్లో పెట్టారు. తాజాగా కృష్ణ జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
-
ఇటీవల యాక్టివ్..
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని అరెస్టు ఉంటుందన్న టాక్ నడిచింది. కానీ ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ బైపాస్ సర్జరీ చేసుకున్న అనంతరం కొద్దిరోజులపాటు హైదరాబాద్ కి పరిమితం అయ్యారు.
Also Read: తెలంగాణపై దృష్టి పెట్టిన జనసేనాని.. మణికొండలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!! – Crime Mirror
ఇటీవల యాక్టివ్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై విచారణకు ప్రాసిక్యూషన్ అనుమతి రావడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక్క ఈ కేసు మాత్రమే కాదు చాలా కేసులు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని అరెస్టు కాక తప్పదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.