క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ‘మురసు’ తీవ్ర తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాన్ తీరానికి చేరువవుతున్న కొద్దీ వాతావరణం వేగంగా మారిపోతోంది. ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ జలమయమయ్యాయి.అటు మార్కాపురం, గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ అర్ధరాత్రి నుంచి నాన్‌స్టాప్‌గా వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో గాలి వేగం విపరీతంగా పెరిగింది. కాసేపట్లో ఈ తుఫాన్ తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.తీరం దాటే సమయంలో ఒంగోలు, చీరాల, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 120 నుంచి 160 కిలోమీటర్ల అతి భారీ వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇటువంటి తీవ్ర వేగంతో వీచే గాలుల వల్ల చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
రంజీ ట్రోఫీలో విదర్భ స్పిన్నర్ సంచలనం..!
ఈ తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏ క్షణంలోనైనా సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ఉధృతి తగ్గే వరకు ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
