క్రైమ్ మిర్రర్ : ఒమన్ తీరంలో భారతదేశానికి చెందిన నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. భారత నౌకాదళం, ఒమన్ కోస్ట్ గార్డ్ బృందాలు సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యల ద్వారా నౌకలో ఉన్న మిగతా సిబ్బందిని రక్షించారు.
వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ‘ఎంఎస్వీ అల్ జుసుఫీ’ (MSV Al Jusufi) అనే నౌక ఒమన్ తీర ప్రాంతంలో ఉండగా దాడికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగిలిన 13 మందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విషయాన్ని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. మృతి చెందిన నావికుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీం అజీజ్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం నుంచి బయటపడిన 13 మంది భారతీయ నావికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. బాధితులకు వైద్య సహాయం, ఇతర అవసరమైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటోంది.
అలాగే ప్రాణాలతో బయటపడిన నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు, మృతి చెందిన నావికుడి మృతదేహాన్ని కూడా వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారతీయ నావికుల భద్రతకు సంబంధించి ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. విదేశీ సముద్ర జలాల్లో పనిచేస్తున్న భారతీయ సిబ్బందికి రక్షణ కల్పించే అంశంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
also read : నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ.. భారతీయుడి మృతి, ఇద్దరికి గాయాలు
