Homeఅంతర్జాతీయంమైనర్‌పై లైంగిక వేధింపులు.. మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అరెస్ట్

మైనర్‌పై లైంగిక వేధింపులు.. మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : మాల్దీవుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు మాల్దీవుల పోలీసులు వెల్లడించారు.

పోలీసులు సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నవంబర్ 2వ తేదీన కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా రాత్రి 9:59 గంటలకు అబ్దుల్లా షాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లలోపు ఉన్న ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై అనుమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను అబ్దుల్లా షాహిద్ ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని పేర్కొంటూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదు. కాగా, అబ్దుల్లా షాహిద్‌కు మాల్దీవుల రాజకీయాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంది. 2018 నుంచి 2023 వరకు ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఇబ్రహీం మొహమ్మద్ సోలి మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు.

అంతేకాకుండా 2021-22 మధ్య ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మాల్దీవుల పార్లమెంట్ అయిన పీపుల్స్ మజ్లీస్‌కు స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2024 ఫిబ్రవరి నుంచి 2026 ఆగస్టు వరకు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి నాయకత్వం వహించారు. ఇక 2028లో జరగనున్న మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఓ సాహిత్య సదస్సుకు కూడా షాహిద్ హాజరయ్యారు. ‘స్పేసెస్ వీ కాల్ హోమ్: డయాస్పోరా అండ్ బిలాంగింగ్’ అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక మాజీ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్యసమితి మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
also read : ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. భారతీయ నావికుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు