క్రైమ్ మిర్రర్ : నేపాల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సోలుఖుంబు ప్రాంతంలోని హెలిపోర్ట్లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
మంగళవారం ఉదయం 8:11 గంటలకు ఫిష్టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. రెండు హెలికాప్టర్ల రోటర్ బ్లేడ్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 47 ఏళ్ల భారతీయుడిగా గుర్తించారు. ఆయన పేరు వసంత కుమార్ బలరామరాముడు కాగా, స్వస్థలం చెన్నైగా తెలిసింది. అయితే ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గాయపడిన వారిలో ఒకరిని మరో హెలికాప్టర్ ద్వారా లుక్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లలో మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నేపాల్ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
also read : భూ వివాదం.. మహిళ దారుణ హత్య
