క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్లో మరోసారి గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు తుషార్ కపూర్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో ఓ వ్యక్తి తుషార్ కపూర్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ కాల్లో రూ.5 కోట్లు చెల్లించాలని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన తుషార్ కపూర్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితమే ఆయన నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతాపరమైన కారణాలతో ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ బెదిరింపు కాల్‌పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ వ్యవహారం వెనుక నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన, ఇతర ప్రముఖులకు వచ్చిన బెదిరింపులు సినీ పరిశ్రమలో ఆందోళన కలిగించాయి. ఇప్పుడు తుషార్ కపూర్‌కు కూడా బెదిరింపులు రావడంతో బాలీవుడ్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. కాగా, తుషార్ కపూర్ ఇప్పటివరకు 30కి పైగా హిందీ చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ గుర్తింపు పొందారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌కు ఆయన సోదరుడు.
also read : ఏపీని వణికిస్తున్న ‘మురసు’ తుఫాన్
