క్రైమ్ మిర్రర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో భూ వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. భూమి కోసం భర్త కుటుంబ సభ్యులే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోయిలకొండ మండలం చింతల్ తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
చింతల్ తండాకు చెందిన బలరాంకు, ఓబ్లాయిపల్లి తండాకు చెందిన సునీతతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బలరాంకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏడాది క్రితం బలరాం సోదరులు మాన్యనాయక్, పాండునాయక్ అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన నిర్ణయం ప్రకారం బలరాంకు చెందిన ఎకరంన్నర భూమిని సునీత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో నివసిస్తోంది.
ఇటీవల చింతల్ తండాకు తిరిగి వచ్చిన సునీత పొలం వైపు వెళ్తుండగా మాన్యనాయక్ ఆమెను అడ్డుకుని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఉన్న పాండునాయక్, అతని భార్య పార్వతి, మరో వ్యక్తి మాణిక్యనాయక్తో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సునీత ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
also read : సూరత్‌లో దారుణం: ఇంటిపనులు చెప్పినందుకు తండ్రిని హతమార్చిన కుమార్తె
