జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన మూడేళ్ల బాలుడు రుద్ర మహేశ్ కస్టడీ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, జిల్లా అధికారుల జోక్యంతో చిన్నారి తనను ఎంతోకాలంగా పెంచుకుంటున్న శ్రీనివాస్, సరిత దంపతుల వద్దకు చేరాడు. బాలుడిని తిరిగి తమ దగ్గరకు చేర్చుకోవాలన్న ఆ దంపతుల ఎదురుచూపులకు తెరపడటంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
కరీంనగర్‌లోని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న రుద్ర మహేశ్.. తన పెంపుడు తల్లి సరితను చూసి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. “అమ్మా.. నన్ను ఇంటికి తీసుకెళ్లు.. నాకు భయంగా ఉంది” అంటూ చిన్నారి వేడుకోవడం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియోతో బాలుడి కస్టడీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాలకు చెందిన కాసారపు శ్రీనివాస్, సరిత దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఐదు రోజుల వయసున్నప్పటి నుంచే రుద్ర మహేశ్‌ను తమ దగ్గర పెంచుకుంటున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం చిన్నారిని దత్తత తీసుకున్నామని ఆ దంపతులు చెబుతున్నారు. అయితే దత్తత ప్రక్రియకు అవసరమైన చట్టపరమైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో అధికారులు బాలుడిని వారి నుంచి వేరు చేసి కరీంనగర్‌లోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
దీంతో తమ వద్దే పెరిగిన చిన్నారిని తిరిగి అప్పగించాలని కోరుతూ శ్రీనివాస్, సరిత దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం W.P. నెం. 31588/2026లో అక్టోబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాలుడి మధ్యంతర కస్టడీని దంపతులకు అప్పగించాలని ఆదేశించింది.
అయితే కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ చిన్నారి అప్పగింతలో జాప్యం జరుగుతోందని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 28న న్యాయస్థానం ఆదేశాల ప్రతులను శిశు సంక్షేమ కమిటీ (CWC)కి అందించినా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్‌కు తమ సమస్యను వివరించారు.
దీనిపై స్పందించిన కలెక్టర్.. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని దంపతులకు భరోసా ఇచ్చారు. శిశు సంక్షేమ కమిటీ అనుమతి, ఇతర పరిపాలనాపరమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో ఆలస్యం జరిగిందని వివరించారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయానికి బాలుడిని అప్పగించే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.
కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు అధికారులు సోమవారం సాయంత్రమే చర్యలు చేపట్టి రుద్ర మహేశ్‌ను శ్రీనివాస్, సరిత దంపతులకు అప్పగించారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ముగింపు లభించింది. తనను చూసి కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి తిరిగి వారి చెంతకు చేరడంతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు జోక్యం, అధికారుల చర్యలతో ఈ కస్టడీ వివాదం చివరకు సుఖాంతమైంది.
also read: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. ‘షాట్‌గన్ గేమ్స్’లో భారీ పెట్టుబడి!
