Homeసినిమాఅందరినీ మెప్పించడం కష్టం.. ‘రామాయణం’ పాటల విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అందరినీ మెప్పించడం కష్టం.. ‘రామాయణం’ పాటల విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘రామాయణం’ సినిమా పాటలపై వస్తున్న విమర్శలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ.. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలని ఆయన అన్నట్లు గుర్తుచేశారు.

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ గీతానికి కొందరు ప్రశంసలు కురిపించగా, మరికొందరు సంగీత శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ పాటపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఈ విమర్శలపై స్పందించిన రెహమాన్.. తన సంగీతాన్ని ముందుగా తానే సమీక్షించుకుంటానని తెలిపారు. తాను రూపొందించిన ప్రతి పాట గొప్పదని భావించనని, ఒక సంగీత రచన వెనుక ఎంతో ఆలోచన, శ్రమ ఉంటాయని వివరించారు. కొన్ని సందర్భాల్లో ఒక పాట పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవడానికి నెలల సమయం పడుతుందని చెప్పారు. అందుకే వెంటనే ఒక నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

కొన్ని పాటలు మొదటిసారి విన్నప్పుడు సాధారణంగా అనిపించినా, కాలక్రమేణా వాటిపై అభిప్రాయం మారుతుందని రెహమాన్ పేర్కొన్నారు. పచ్చడి మాదిరిగా కొన్ని సంగీత రచనలు సమయం గడిచేకొద్దీ మరింత రుచిగా అనిపిస్తాయని వివరించారు. పాటలోని ఒక చిన్న అంశాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మొత్తం సంగీతంపై అభిప్రాయం ఏర్పరచుకోవద్దని సూచించారు.

‘రామాయణం’ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో సంగీతాన్ని సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. భారతీయ ప్రేక్షకుల కోసం రూపొందించే వెర్షన్‌తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మరో వెర్షన్‌పైనా పనిచేస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న, రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమా కథతో పాటు సంగీతంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

also read: ప్రభుత్వ పాఠశాలలకు మంచు లక్ష్మి అండ.. 48 స్కూళ్లను దత్తత తీసుకున్న ‘టీచ్ ఫర్ చేంజ్’!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు