క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్నింటికీ సమాధానంగా.. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏ పార్టీ కలిసి వచ్చినా, రాకపోయినా.. ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలంగాణలోనూ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై జనసేన పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం కార్యక్రమంలో తెలంగాణ గురించి ప్రస్తావించడం.. హనుమకొండలో తన అభిమాని నిరంజన్‌ను కలవడం వంటి వరుస సంఘటనలతో.. పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. దీంతో తెలంగాణ జనసేన నేతల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన పార్టీని విస్తరించడంలో భాగంగా హైదరాబాద్ మణికొండలో కొత్తగా నిర్మించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారు.
రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ కొత్త ఆఫీసును ప్రారంభించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడనున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన పర్యటనలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం గురించి ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.