క్రైమ్ మిర్రర్ : యూరప్ దేశాలకు అక్రమంగా వలస వెళ్లే క్రమంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ వైపు వెళ్తున్న ఓ బోటులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే సహాయక బృందాలు వేగంగా స్పందించి 157 మంది వలసదారులను సురక్షితంగా బయటకు తీశాయి. ఇంగ్లిష్ ఛానెల్ మార్గం ద్వారా ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు అక్రమంగా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రయత్నిస్తుంటారు. సరైన భద్రతా ప్రమాణాలు లేని చిన్న పడవలు, బోట్లలో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఇంగ్లిష్ ఛానెల్‌లో ఓ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బోటు సిబ్బంది వెంటనే రెస్క్యూ బృందాలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అప్పటికే బోటులో ఎక్కువ భాగం అగ్నికి ఆహుతైనప్పటికీ, రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి 157 మంది వలసదారులను రక్షించారు. ఈ ఘటనలో మరెవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బౌలోగ్నే-సుర్-మెర్ సమీప సముద్ర ప్రాంతంలో అధికారులు నౌకలు, బోట్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదకర మార్గంగా ఇంగ్లిష్ ఛానెల్
ఇంగ్లిష్ ఛానెల్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. మెరుగైన జీవన అవకాశాల కోసం వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఈ మార్గం ద్వారా యూరప్ చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అనధికారిక మార్గాల్లో ప్రయాణించడం, భద్రత లేని పడవలను ఉపయోగించడం వల్ల అనేక మంది మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 నుంచి 2025 మధ్యకాలంలో ఇంగ్లిష్ ఛానెల్‌లో 168 మంది వలసదారులు మృతి చెందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా బోటు ప్రమాదాలే కారణంగా నమోదయ్యాయి.
also read : గొడవపడుతుండగా నవ్వాడని కొడుకుపై వేడి నీళ్లు పోసిన తండ్రి
