క్రైమ్ మిర్రర్ : జమ్మూకశ్మీర్లో వరుసగా చోటుచేసుకుంటున్న క్లౌడ్ బరస్ట్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుల్లో ఇప్పటివరకు 31 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు జమ్మూకశ్మీర్లో సుమారు 35 క్లౌడ్ బరస్ట్ ఘటనలు నమోదయ్యాయి. వీటి కారణంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు, పాఠశాలలు, సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో జమ్మూకశ్మీర్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, అనూహ్య వర్షాలు, తరచూ క్లౌడ్ బరస్ట్లు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
భారీగా ప్రభావితమైన ప్రాంతాలు
జమ్మూ డివిజన్లోని పూంచ్, రాజౌరి, కఠువా, దోడా, కిష్త్వార్ జిల్లాల్లో ప్రకృతి బీభత్సం తీవ్రంగా కనిపించింది. కశ్మీర్ లోయలోని షోపియాన్, అనంతనాగ్, బందిపొర, కుప్వారా ప్రాంతాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుప్వారా, షోపియాన్ ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బందిపొరలో చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్లో ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలు ఇళ్లు, పొలాలు, పశువుల కొట్టాలు వరదల్లో దెబ్బతిన్నాయి.
సహాయక చర్యలు ముమ్మరం
ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
ఆగస్టు 4, 5 తేదీల్లో జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్వత ప్రాంతాల్లో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదుల పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
నిపుణుల ఆందోళన
కొండ ప్రాంతాల్లో తక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడం వల్ల నీటి ప్రవాహ మార్గాలు ఒక్కసారిగా నిండిపోయి ఫ్లాష్ ఫ్లడ్స్కు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు, రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావాలు కలవడం వల్ల హిమాలయాలు, పీర్ పంజా ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరిస్తున్నారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
also read : వరంగల్లో గురుకుల హాస్టల్ లో 25 మంది బాలికలు అస్వస్థత
