క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకుని ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన ధాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ (43)తో కలిసి చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న చాట్వాజ్ మెన్షన్ అపార్ట్‌మెంట్‌కు బంధువును పరామర్శించేందుకు వెళ్లారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ వద్దకు చేరుకున్న అనంతరం శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్‌లోకి వెళ్లారు. అనంతరం అనసూయ లిఫ్ట్‌లోకి ప్రవేశించే సమయంలో ఒక కాలు లోపల, మరో కాలు బయట ఉన్న పరిస్థితిలో లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలినట్లు సమాచారం. దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. భర్త కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ నివాసితులు, స్థానికులు వెంటనే స్పందించి లిఫ్ట్‌ను నిలిపివేసి ఆమెను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన సమయంలో లిఫ్ట్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నాయని, అయినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై మృతురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లిఫ్ట్ టెక్నీషియన్‌తో పాటు అపార్ట్‌మెంట్ అసోసియేషన్, లిఫ్ట్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
also read : ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు
