•మళ్లీ రంగంలోకి.. శనివారం ఒక్కరోజే రూ.30 వేల కోట్ల ఆస్తుల రక్షణ
•ఆక్రమణదారుల గుండెల్లో వణుకు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- హైడ్రా మరోసారి సంచలనం సృష్టించింది. తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఏకకాలంలో భారీ మెగా డ్రైవ్ నిర్వహించింది. ఏకంగా ఎనిమిది వందల నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి కల్పించింది. ఆ భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి సుమారు 30 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజంగా ఇది రికార్డు బ్రేక్.
కొద్దికాలం విరామం..
గత కొంతకాలంగా హైడ్రా విరామం తీసుకుంది. కానీ శనివారం భారీ ఆపరేషన్ కు తెర తీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ లో అత్యధికంగా 650 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు. 1954 ఖాస్ర పహాని రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉంది. అయినా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఫామ్ హౌస్ లు నిర్మించి ఆక్రమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమణదారులు ప్రతిఘటించిన అధికారులు విడిచిపెట్టలేదు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
విలువైన భూములు స్వాధీనం..
మరోవైపు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దుల్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో జనరల్ ల్యాండ్ రిజిస్టర్ కింద నమోదైన 15 ఎకరాల విలువైన భూమిని కూడా హైడ్రాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కొండలను బద్దలు కొడుతూ.. అక్రమ లేఅవుట్లు వేసి వన్యప్రాణులకు సైతం హాని కలిగిస్తూ కొందరు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు ఐటీ హబ్ సమీపంలోని అత్యంత ఖరీదైన రాయదుర్గంలో ఆక్రమణలకు గురైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కంచ ఏర్పాటు చేశారు.
అన్ని శాఖల సమన్వయంతో..
మళ్లీ హైదరాబాద్ దూకుడు పెంచడంతో ఆక్రమణదారుల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ శాఖలతో పక్కాగా సమన్వయం చేసుకుంటూ హైడ్రా మెగా ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజా ఆస్తులను కబ్జాదారుల భారీ నుంచి కాపాడేందుకు సీఎం రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ల్యాండ్ మాఫియా గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. వారాంతపు నాడు హైడ్రా రంగంలోకి దిగుతోంది. గత కొద్ది రోజులుగా స్వల్ప విరామం ఇచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి తన దూకుడు పెంచింది.