Homeతెలంగాణ'దూషణ' రాజకీయం!

‘దూషణ’ రాజకీయం!

•విధానపరమైన విమర్శల స్థానంలో తిట్ల దండకాలు
•దిగజారుతున్న తెలంగాణ పాలిటిక్స్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-

తెలంగాణలో రాజకీయం రూటు తప్పుతోంది. వ్యక్తిగత దూషణలకు ఇప్పుడు నాయకులు పెద్దపీట వేస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల స్థానాన్ని ఇప్పుడు పచ్చి బూతులు, వ్యక్తిగత దూషణలు ఆక్రమిస్తున్నాయి. శనివారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో నిరుద్యోగుల సమస్యలను పక్కనపెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో తిట్ల దండకం అందుకున్నారు గులాబీ పార్టీ నేతలు. అయితే దీనిపై సాయంత్రం స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వెంత.. నీ జాతి ఎంత.. నీ జాతి మా ప్రజాపాలన మీద శాపనార్ధాలు పెడతారా అంటూ సీఎం కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ విమర్శలు అంటే విధానపరమైనవి కాదు. కేవలం బూతుపరంగా.. జుగుప్సాకరంగా కామెంట్స్ కొనసాగుతున్నాయి.

అసహ్యం కలిగించేలా..
రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు అనేవి సహజం. కానీ తెలంగాణ సమాజంలో మాత్రం ఇప్పుడు తిట్లు వచ్చాయి ఆ స్థానంలో. పతాక స్థాయికి తిట్ల పురాణం చేరుతోంది. పౌర సమాజంతో పాటు సామాన్య ప్రజలకు సైతం తీవ్ర అసహ్యం కలిగిస్తోంది. నిరుద్యోగ సంగ్రామ సభ పెట్టిన కేటీఆర్ కొంతమంది యువతతో మాట్లాడించారు. వారు రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత బూతులు తిట్టడానికి తమ సమయం కేటాయించారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా తిట్టించడం.. దానిని ఆస్వాదించడం మాత్రం సరికాదు.

రేవంత్ వ్యూహాత్మకంగా..
ప్రతిపక్షం చేసే విమర్శలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సీఎం రేవంత్. తనను తిడుతున్న ప్రతి సందర్భాన్ని పరోక్షంగా ఒక సామాజిక అంశంగా మారుస్తున్నారు. తెలంగాణ సమాజంలో గత పాలకుల సామాజిక వర్గం పై సహజంగా ఉంటే కొన్ని వర్గాల వ్యతిరేకతను.. మరింత పెంచేందుకు వాడుకుంటున్నారు. తెలంగాణను పదేళ్లు దోచుకున్న ఒక నిర్దిష్ట జాతి శక్తులు, ఇప్పుడు పేద ప్రజా పాలనపై శాపనార్ధాలు పెడుతున్నాయి అంటూ చేస్తున్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే విధానపరమైన విమర్శల స్థానంలో ఈ తిట్ల దండకం, దూషణలపర్వం ఎంత మాత్రం సహేతుకం కాదు అని తెలంగాణలో మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు