Homeఆంధ్ర ప్రదేశ్ముహూర్తం ఫిక్స్!

ముహూర్తం ఫిక్స్!

•ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
•ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
•ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:- ఉత్తరాంధ్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆధునిక హంగులతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం కూడా జరిగింది. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం జాతికి అంకితం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు.

విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు అయ్యింది.. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 2200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగింది. 100% పనులు పూర్తి కావడంతో ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు రూ.4500 కోట్ల భారీవ్యయంతో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. విమానాశ్రయ నిర్వహణకు అవసరమైన ఏరో డ్రోమ్ లైసెన్సు లభించడంతోపాటు కేంద్ర హోం శాఖ కూడా దీనిని అధికారిక ఇన్నిగ్రేషన్ చెక్పోస్ట్ గా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో విదేశీ సర్వీసుల నిర్వహణకు సైతం మార్గం సుగమం అయింది.

జాతీయ రహదారి చెంతనే..
చెన్నై- కోల్కత్తా జాతీయ రహదారికి సమీపంలో.. బంగాళాఖాతం చెంతనే ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడం విశేషం. ఉత్తరాంధ్ర పరిధిలోని పరిశ్రమలు, ఐటి రంగం, పర్యాటక రంగాలు అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు ఒక ప్రత్యేక డెడికేటెడ్ కనెక్టివిటీ రూటు కూడా సిద్ధం చేసింది. ఆగస్టు 1న విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కార్యాలయం సైతం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి మిగతా ప్రోటోకాల్ షెడ్యూల్, పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు