క్రైం మిర్రర్ : అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘటనపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై తీవ్ర విమర్శలు చేసిన ఖమేనీ, ఆ దేశాన్ని “క్రిమినల్ దేశం”గా అభివర్ణించారు. అమెరికా చర్యలు ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆరోపించారు.
ఇటీవల తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొజ్తబా ఖమేనీ ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజా స్పందన ప్రాంతీయ రాజకీయాల్లో మార్పులకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యత కనిపించిందని అన్నారు.
ఇదిలా ఉండగా.. జోర్డాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న బలగాల దాడిలో అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ నిల్వ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తాజా వైమానిక దాడుల్లో నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం కూడా లక్ష్యంగా మారిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
also read : జాతీయ పోలీస్ అకాడమీలో వేధింపులు కలకలం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదు