క్రైమ్ మిర్రర్ : అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ థాయ్‌లాండ్‌లోని పటాయా సమీప ప్రాంతానికి చేరుకుంది. సుమారు 5 వేల మంది సిబ్బందితో ఉన్న ఈ నౌక పశ్చిమాసియా ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణం చేస్తోంది. దాదాపు 250 రోజుల పాటు సముద్రంలోనే విధులు నిర్వహించిన సిబ్బంది.. సుదీర్ఘ మిషన్ అనంతరం విశ్రాంతి కోసం పటాయా ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్‌తో జరిగిన యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న అనంతరం అబ్రహం లింకన్ వెనుదిరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నౌకను పటాయా బీచ్ రిసార్టుకు సమీపంలోని లాయిమ్ చాబాంగ్ పోర్ట్ వద్ద నిలిపారు.
అయితే అమెరికా సైనికుల భారీ రాకతో పటాయాలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీచ్‌ఫ్రంట్, నైట్‌లైఫ్ ప్రాంతాల్లో భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. గతంలో వియత్నాం యుద్ధ సమయంలోనూ అమెరికా సైనికులు విశ్రాంతి కోసం పటాయాకు వచ్చిన చరిత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వేలాది మంది సైనికులు నగరానికి రానున్న నేపథ్యంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని థాయ్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
సైనికుల రాక నేపథ్యంలో పటాయా నగరంలో పోలీసుల గస్తీని పెంచారు. బీచ్‌ఫ్రంట్, నైట్‌లైఫ్ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల నిర్వహించిన వారాంతపు తనిఖీల్లో సుమారు 50 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరిగినప్పుడు నగరంలో వ్యభిచారాన్ని నియంత్రించడం పోలీసులకు మరింత సవాలుగా మారుతుందని పటాయా పోలీసు చీఫ్ ఆనెక్ స్రాతోంగ్యూ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కస్టమర్ల కోసం సెక్స్ వర్కర్లు సంచరించే అవకాశాలు పెరగవచ్చని ఆయన తెలిపారు. అమెరికా యుద్ధనౌక రాకతో పటాయాలోని వ్యాపార రంగానికి ఊతం లభించే అవకాశం ఉన్నప్పటికీ.. భారీ సంఖ్యలో సైనికుల రాకతో భద్రత, చట్టవ్యవస్థపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
also read : ‘నిబద్ధత, సంకల్పం ఉన్న నాయకుడు’: పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ జన్మదిన శుభాకాంక్షలు
