Homeక్రైమ్పెళ్లైన రెండు నెలలకే విషాదం.. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య

పెళ్లైన రెండు నెలలకే విషాదం.. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య

పెళ్లైన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం నింపింది. అత్తింటి వేధింపులు భరించలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20)కి దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేష్‌తో జూన్ 25న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే ఆమెను అదనపు కట్నం కోసం వేధించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అత్తింట్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఉషారాణి తన తల్లిదండ్రులకు తెలియజేసినట్లు సమాచారం. వారు ఆమెకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే వేధింపులు మరింత తీవ్రం కావడంతో ఉషారాణి పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉషారాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తల్లి పద్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై విక్రమ్ తెలిపారు. వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

also read: క్లోరోక్విన్ మాత్రలు వాడిన రెండో తరగతి విద్యార్థిని మృతి, 53 మందికి అస్వస్థత..

తాజావార్తలు