హీరో సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్ర గిరి వారాహి’ విడుదలకు సిద్ధమైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కథనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌పై సానుకూలంగా స్పందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉందని, ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్టులు సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకొస్తాయని ప్రశంసించినట్లు తెలిపింది.
వారాహి అమ్మవారి మహిమ, ఆధ్యాత్మిక అంశాలను మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భక్తి, రహస్యం, ఉత్కంఠ కలగలిసిన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేసినట్లు చిత్రబృందం చెబుతోంది.
ఇలాంటి డివోషనల్ కథాంశాలతో మరిన్ని సినిమాలు రావాలని సెన్సార్ సభ్యులు ఆకాంక్షించినట్లు సమాచారం. సెన్సార్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్‌తో చిత్రబృందంలోనూ ఉత్సాహం నెలకొంది.
సుమంత్ గత చిత్రాలకు భిన్నమైన కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘మహేంద్ర గిరి వారాహి’పై అంచనాలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
also read: మమితా బైజుకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన మలయాళ నటి
