-
కార్యాలయాలపై దాడులు చేసుకుంటున్న కాంగ్రెస్, బిజెపి శ్రేణులు
-
దిగజారుతున్న శాంతిభద్రతలు
-
హై కమాండ్ లు కట్టడి చేయకపోతే కష్టమే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయ పోరు కట్టు దాటుతోంది. క్రమశిక్షణ దాటుతోంది. సిద్ధాంతపరంగా పోరాటం చేయాల్సిన రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగుతున్నాయి. కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు ఒకరి కార్యాలయాలపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. హైదరాబాదులోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ వివాదం.. నల్గొండ జిల్లా కేంద్రానికి పాకింది. దాడులు- ప్రతి దాడులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పర సవాళ్లకు సైతం దారితీస్తోంది. ఇంకా దాడులు చేసుకుంటామని ఎవరికి వారు హెచ్చరిస్తుండటం పరిస్థితి చేయి దాటుతోంది.
ఆ ఘటనతో ప్రారంభం…
Also Read:ఒకేసారి నలుగురికి అంతిమ వీడ్కోలు.. కన్నీరుమున్నీరైన పార్డి(బీ) గ్రామం
హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వెనుక గేటు పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల రంగు పూయడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బిజెపి వర్గాలు నిరసన చేపట్టాయి. నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ లోని శ్రీనగర్ కాలనీలో ఆర్ అండ్ బి శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత క్యాంప్ ఆఫీస్ పై.. బిజెపి శ్రేణులు గుడ్లు, టమోటాలు విసిరి.. మంత్రి ఫ్లెక్సీలను చింపేశారు. మంత్రి కార్యాలయం పై దాడి వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కాయి. బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బిజెపి జిల్లా కార్యాలయం పై కూడా దాడికి ప్రయత్నించారు. లోపల ఉన్న బిజెపి నేతలు తలుపులు మూసుకొని ప్రాణాలు దక్కించుకోవాల్సి వచ్చింది.
స్పందించిన అధిష్టానాలు…
Also Read: సముద్ర మట్టాల పెరుగుదలతో భారీ ముప్పు.. భారత్‌లో ఈ నగరాలకు డేంజర్ బెల్స్
అయితే ఇలా రాజకీయ పార్టీల కార్యాలయాలపై పరస్పర దాడులు నిర్వహించుకోవడం శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. అయితే ఈ రెండు ఘటనలపై ఆ పార్టీ హైకమాండులు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని బిజెపి నాయకత్వం మండిపడుతోంది. కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వైరం కార్యకర్తల స్థాయిలోనే ఉంది. నాయకుల స్థాయిలోకి వెళ్తే మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అధినేతలు జోక్యం చేసుకొని నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
