క్రైమ్ మిర్రర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో మంగళవారం గ్రామమంతా శోకసంద్రంగా మారింది. మృతులు తులసీరాం, ఆవుల గంగాధర్, తూము సాయిలు, తూము గౌరబాయిగా గుర్తించారు.
ప్రమాదంలో మృతి చెందిన నలుగురి అంత్యక్రియలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రామంలోని స్థానిక స్మశానవాటికలో నిర్వహించారు. తమ ఆత్మీయులను చివరిసారిగా చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులు కాగా.. జీపు డ్రైవర్ తులసీరాం మరాఠా సామాజిక వర్గానికి చెందినవారని గ్రామస్థులు తెలిపారు.
నిన్నటి వరకు తమతో కలిసి ఉన్నవారు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియల సమయంలో విషాద వాతావరణం నెలకొంది. మృతులకు గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. మృతుల అంతిమయాత్రలో సర్పంచ్ మడి ప్రవీణ్, మాజీ ఎంపీపీ తూమ్ లక్ష్మి, తూమ్ రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ వి. రేఖా మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ బోయిడి విట్టల్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
also read : సముద్ర మట్టాల పెరుగుదలతో భారీ ముప్పు.. భారత్లో ఈ నగరాలకు డేంజర్ బెల్స్
