క్రైమ్ మిర్రర్ : వాతావరణ మార్పుల ప్రభావంతో సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణాసియాకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భారత్‌లోని ముంబై, కోల్‌కతా వంటి తీర నగరాలతో పాటు దక్షిణాసియాలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 1.4 కోట్ల మందికి భవిష్యత్తులో నివాస భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ సమర్పించిన సముద్ర మట్టాల పెరుగుదలపై నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించారు. మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, హిమనదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం వంటి పరిణామాలు సముద్ర మట్టాల పెరుగుదలను వేగవంతం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
కోట్లాది మందిపై ప్రభావం
దక్షిణాసియాలోని లోతట్టు తీర ప్రాంతాల్లో సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐరాస తెలిపింది. ముంబై, కోల్‌కతా, ఢాకా వంటి నగరాల్లో నివసిస్తున్న ప్రజలు వరదలు, తీర ప్రాంతాల ముంపు వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టానికి ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో సుమారు 77 కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని నివేదిక వెల్లడించింది. సముద్ర మట్టాల పెరుగుదల కొనసాగితే వీరి నివాసాలు, జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాగునీటికి ముప్పు.. ఆర్థిక నష్టాలు
సముద్ర జలాలు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం వల్ల తాగునీటి వనరుల్లో ఉప్పునీరు చేరే ప్రమాదం ఉందని ఐరాస తెలిపింది. రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు వ్యవసాయ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా తీర ప్రాంతాల్లో తరచూ వరదలు సంభవించడం వల్ల ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని నివేదికలో వివరించింది.
గతంతో పోలిస్తే మరింత వేగం
సముద్ర మట్టాల పెరుగుదల వేగం ఇటీవలి కాలంలో మరింత పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2014 నుంచి 2023 మధ్య సముద్ర మట్టం ఏడాదికి సగటున 4.7 మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు తెలిపింది. అయితే 2024లో ఈ పెరుగుదల 5.9 మిల్లీమీటర్లకు చేరినట్లు వెల్లడించింది.
ముందస్తు చర్యలకు పిలుపు
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు దేశాలు ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. తీర ప్రాంతాల రక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు నిర్వహణ చర్యల కోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది.
also read : లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టోలిచౌక్ ఎస్సై
