క్రైం మిర్రర్ : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పోలీస్ శిక్షణ సంస్థగా పేరున్న హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా అధికారి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ, దుర్భాషలాడుతూ మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
అంతేకాకుండా ఈ నెల 9న తనను బెదిరించారని, మెడపై కత్తి పెట్టి భయపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తన వ్యక్తిగత వీడియోలను అనుమతి లేకుండా రికార్డు చేసి, మొబైల్ ఫోన్‌ను తీసుకుని వాటిని తన భర్తకు వాట్సాప్ ద్వారా పంపినట్లు కూడా బాధితురాలు ఆరోపించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులకు శిక్షణ అందించే అత్యున్నత సంస్థల్లో ఒకటైన జాతీయ పోలీస్ అకాడమీలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
also read : జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 10 మంది మృతి