జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు రాజౌరి, పూంచ్‌లో భారీ వర్షాల కారణంగా పరిస్థితులు విషమించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు కారణంగా కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. మరికొందరు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఇళ్లు దెబ్బతినగా, రహదారులు తెగిపోవడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొన్ని వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేసింది. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇంకా కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
also read: వైరల్ వీడియో: ఇంట్లోకి రావాలని ప్రయత్నించిన డెలివరీ బాయ్ … తల్లి అప్రమత్తత