ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేశాడంటూ ఓ నర్సింగ్ అధికారిపై ఆరోపణలు వచ్చిన ఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగి, ఆ తర్వాత మాట మార్చాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్‌ఎం అప్రెంటిషిప్ శిక్షణ పొందుతున్న సమయంలో నర్సింగ్ అధికారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమ వ్యవహారంగా మారిందని, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తనను నమ్మించాడని ఆమె ఆరోపించింది.
తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని, కొంతకాలానికి తాను గర్భవతిని అయిన విషయం తెలియడంతో పెళ్లి గురించి అడిగినప్పుడు సదరు అధికారి స్పందించకుండా దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో న్యాయం కోసం ఆమె నారాయణఖేడ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
also read: జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు: దెబ్బతిన్న రాజౌరి–పూంచ్ జిల్లాలు, పలువురు మృతి