క్రైం మిర్రర్ : రాజకీయ కక్షలు మరోసారి రక్తం చిందించాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్న దాడి ఘటనలో కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆడుప మహేశ్ మృతి చెందారు. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మహేశ్‌ను శనివారం రాత్రి జన్ను మధు ఫోన్ చేసి కోటిలింగాల ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రావాలని పిలిచినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన మహేశ్‌పై పత్రి కుమార్‌తో పాటు మరికొందరు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
“ఎమ్మెల్యే దగ్గర మా గురించి ఏం చెప్పావు?” అంటూ ప్రశ్నించిన నిందితులు, అనంతరం మహేశ్ ఫోన్ లాక్కొని ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్న మహేశ్ ఎలాగోలా బయటపడి గ్రామానికి చేరుకోగా, స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మహేశ్ శరీరానికి సుమారు 50 శాతం కాలిన గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రధాన నిందితుడిపై గతంలో కేసులు
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న పత్రి కుమార్‌పై గతంలో హత్య కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు జీవిత ఖైదు విధించినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
“నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి”
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మహేశ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను 26 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.