Homeక్రైమ్ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

అమీన్‌పూర్, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు కార్లు ప్రమాదానికి గురైన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. పటాన్‌చెరు నుంచి బొల్లారం వైపు వెళ్తున్న ఫార్చ్యూనర్ కారు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అదుపుతప్పింది. రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన అనంతరం పల్టీలు కొడుతూ ఎదురువైపు రహదారిపైకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో అటుగా వస్తున్న ఎంజీ ఆస్టర్ ఈవీ కారును ఫార్చ్యూనర్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన టాటా నెక్సాన్ కారు కూడా ప్రమాదానికి గురైన ఫార్చ్యూనర్‌ను ఢీకొనడంతో ఘటన తీవ్రత మరింత పెరిగింది.

ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్‌లో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌కు చెందిన కైలాష్ రామ్ (27), టాటా నెక్సాన్‌లో ఉన్న ఆనంద్‌నగర్, బండ్లగూడ, నాగోల్ ప్రాంతానికి చెందిన శివ నాగరాజు (43) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఎంజీ ఆస్టర్ ఈవీ కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే వారి వాహనం ప్రమాదంలో దెబ్బతింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు