శ్రీకాకుళం జిల్లాలో భారీ భూకబ్జా యత్నం వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన స్థలాన్ని నకిలీ పత్రాల ఆధారంగా కాజేయాలని ప్రయత్నించిన ఘటనలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ముందస్తు ప్రణాళికతో ఈ కుట్ర నడిచినట్లు గుర్తించారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని టార్గెట్ చేసి, అసలు యజమాని బతికుండగానే ఆయనను మృతుడిగా చూపించే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేసినట్లు వెల్లడైంది.
దర్యాప్తులో భాగంగా నిందితులు అసలు యజమాని కుటుంబ వివరాలను తారుమారు చేసి, ఒక మహిళను నకిలీ వారసురాలిగా చూపించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ వారసురాలి పేరుతో భూమిని విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడు సహా పలువురు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో అప్పటి సబ్-రిజిస్ట్రార్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవడంతో, నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్ చేయడం కారణంగా ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌పై సాక్షులుగా సంతకాలు చేసిన కొంతమంది వ్యక్తులు, నిందితులకు చెందిన ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో భూములు కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
also read: తూప్రాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడు మృతి